Nara Lokesh : లోకేష్ సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు కట్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-11-27 11:56 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు చేసేవారికి విక్రయించే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కట్ చేస్తామని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల ఉప సంఘం ఈరోజు సచివాలయంలో సమావేశమయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ గా పేరు మారుస్తూ ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ వర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ గా మార్చారు. గంజాయి సాగు గుర్తించి ధ్వంసం చేయ‌డానికి డ్రోన్లను వినియోగించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాల‌ని కోరారు.

డ్రగ్స్ ను అమ్మినా...
డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంద‌న్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయాల‌ని క‌మిటీ సూచించింది. పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఇన్ ఫ్లూయెన్సర్స్ తో అవగాహన కల్పించాలని సమావేశాల్లో నిర్ణయించారు. గిరిజ‌నులు గంజాయి పండించకుండా అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందిస్తామ‌ని తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ ఆకే రవికృష్ణ, ఇతర శాఖ‌ల‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News