Chandrababu : జేసీ, ఆదిలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
కూటమి ప్రభుత్వం ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ఫ్లై యాష్ రవాణా కాంట్రాక్టు విషయంలో ఇద్దరు నేతలు రోడ్డుకెక్కడంపై చంద్రబాబు అధికారులతో ఆరా తీశారు. ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకే కూటమిలో ఉంటూ ఇద్దరూ కాంట్రాక్టు కోసం కొట్లాడుకోవడమేంటని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కింద వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నివేదిక ఇవ్వాలంటూ...
అసలు అక్కడ వాస్తవ విషయాలను తనకు తెలియజేయాలంటూ కడప జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని కోరారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కల్గించినా వదిలిపెట్టవద్దని కూడా అధికారులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో ఇద్దరు నేతలు సంయమనం పాటించాలని, ప్రజలు గమనిస్తున్నారన్న విషయం కూడా మర్చిపోయి కాంట్రాక్టుల కోసం ఇలా రోడ్డున పడటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.