Cold Waves : పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న జనం
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రావడానికి భయపడతున్నారు. అక్కడ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. మధ్యాహ్నం వరకూ చలిగాలుల తీవ్రత ఆగడం లేదు.అదే సమయంలో చలిమంటలతో వేడికోసం చలి కాచుకుంటున్నారు. దీంతో పాటు దట్టమైన పొగమంచు ఏర్పడుతుండటంతో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అనేక చోట్ల ఉదయం పన్నెండు గంటలయినా పొగమంచు వీడకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
అనేక రోగాల బారిన పడి...
దీంతో వాహనాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి.సాయంత్రం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు అనారోగ్యంపాలవుతున్నారు. అనేక మంది చలికి భయపడి ఇళ్లలో నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. చాలా మంది ఇంట్లోనే తలదాచుకుంటూ రోగాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ తో పాటు న్యుమోనియా వంటి వ్యాధులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
దీనికి తోడు డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు కూడా ఎక్కువగా సంక్రమిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉస్మానియా, నిలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో పడకలు సరిపోవడం లేదు. రోజురోజుకూ చలి తీవ్రతతో వివిధ రోగాల బారిన పడి ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల జిల్లాలో అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.రానున్న నాలుగు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని అధికారులు చెబుతున్నారు.