Fengal Cyclone : తీరం దాటే ముందు జాగ్రత్త.. అధికారులు హై అలెర్ట్
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రాత్రికి వాయుగుండం తుపాను గా మారనుంది
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రాత్రికి వాయుగుండం తుపాను గా మారనుంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అయితే దీనిని రెడ్ అలెర్ట్ మార్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాను తమిళనాడులో తీరం దాటే అవకాశముందని, అయితే తుపాను తన దిశను మార్చుకునే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే తమిళనాడులోని ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులోని పదమూడు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి.
తీరప్రాంతంలో ఉన్న వారిని...
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కాల్ సెంటర్లను కూడా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రారంభించారు. తీర ప్రాంతంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. ఎప్పుడైనా పునరావాస కేంద్రాలకు తరలి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. నాగపట్నంలోని కొడిక్కరై బీచ్ లో సముద్రం ఇప్పటికే పది మీటర్లు వెనక్కు వెళ్లడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీ వరకూ చేపల వేటపై నిషేధం విధించారు.
సెలవులు రద్దు...
ఆంధ్రప్రదేశ్ లోనూ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్షించారు. తుపాను ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని హోం మంత్రి కోరారు. మరోవైపు నదులు, వాగులు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ కోరింది. దీంతో పాటు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ఎవరూ చెట్ల కింద ఉండవద్దని సూచించారు. అదే సమయంలో పిడుగులు పడే అవకాశముందని కూడా చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.