Rain Alert : మరో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం.. విస్తారంగా వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని చెప్పింది
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న కొద్ది గంటల్లోనే బలపడుతుందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూమహా సముద్రం మీదుగా ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని అధికారులు తెిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 11 నాటికి శ్రీలంక - తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని చెప్పారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో చలి తీవ్రత తగ్గినా ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోనూ వర్షం ప్రారంభమయింది. ఈరోజు గరిష్టంగా భద్రాచలంలో 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 11,12 తేదీల్లో...
అల్పపీడనం మరింత బలపడటం వల్ల ఈ నెల 11, 12 తేదీళ్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయల సీమల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అయితే అల్పపీడనం వాయుగుండంగా మారి, అనంతరం తుపాను గా మారే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను గా మారితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో మరోసారి భారీ వర్షాలు ఖాయమని చెబుతున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వర్షానికి తడిసే ప్రమాదం ఉందని హెచ్చరాించింది.
ఈరోజు వర్షం పడే ప్రాంతాలే...
ఈరోజు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని చెప్పింది. అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేటినుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో రాత్రి నుంచే వర్షం కురవడం ప్రారంభమయింది. జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించించింది. చలిగాలుల తీవ్రత తగ్గినప్పటికీ అల్పపీడనం ప్రభావంతో అకాల వర్షాలు పడి చేతికొచ్చిన పంట అందకుండా పోయే ప్రమాదముందని కూడా హెచ్చరికలు జారీ చేసింది.