నా పొత్తు వారితోనే.. మదనపల్లెలో జగన్

తనకు ఎవరితో పొత్తు ఉండదని, ప్రజలతోనే పొత్తు ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.;

Update: 2022-11-30 07:30 GMT

తనకు ఎవరితో పొత్తు ఉండదని, ప్రజలతోనే పొత్తు ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏది చెబుతానో అది చేసి చూపిస్తానని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కొందరు పెత్తందారులు ప్రయోజనాలను కొందరికే పంచిపెట్టాలని చూస్తున్నారన్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వాదించే వారు విపక్షంలో ఉన్నారన్నారు. మనుషులంతా ఒక్కటే అన్న జ్ఞానం వారికి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. తమ భూముల్లో మాత్రమే రాజధాని కట్టాలన్న ఆలోచన నుంచి బయటపడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న వారికి బుద్ధి చెప్పాలన్నారు. జగన్ బటన్ నొక్కితే శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమెరికా అని చెబుతున్నారన్నారు. గజదొంగల ముఠా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు.

పిల్లల మీద పెట్టే ఖర్చు...
11. 2 లక్షల మందికి 694 కోట్ల రూపాయల లబ్ది చేకూరుతుందన్నారు. పిల్లల మీద పెట్టే ఖర్చును తాను ఖర్చుగా భావించడం లేదన్నారు. పిల్లల చదువులకు తాను పూచీగా ఉన్నానని జగన్ అన్నారు. ఎంతమంది పిల్లలున్నా వారిని చదివించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మీరు చదవండి.. తాను అండగా ఉండి చదివిస్తానని ఆయన అన్నారు. ఆర్థికసాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ చేస్తున్నామని తెలిపారు. వారం రోజుల్లో ఈ డబ్బును కళాశాలల ఫీజులు కట్టాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని ఆయన తెలిపారు.
పేదరికం అవరోధం కాకూడదు...
పిల్లల చదువు కోసం ఈ ప్రభుత్వం ఖర్చుకు వెనకాడదన్నారు. విద్యార్థులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. విద్యారంగం కోసం 54 వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందని జగన్ తెలిపారు. గోరుముద్ద, విద్యాకానుక పథకాలతో పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయని తెలిపారు. పేదరికం చదువుకు అవరోధం కాకూడదని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లలు ఏమాత్రం తీసిపోకుండా విద్యావ్యవస్థను తీర్చి దిద్దుతున్నామని జగన్ తెలిపారు. అక్షరాలు రాయడం.. అక్షరాలు చదవడం మాత్రమే విద్యకు పరమార్థం కాదని, తనకు తానుగా ప్రతి విద్యార్థి నిర్ణయాలను తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలడమే విద్యకు పరమార్థమని అన్నారు. మదనపల్లెలో మెడికల్ కళాశాల త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.


Tags:    

Similar News