చంద్రబాబుతో పోలిస్తే రేవంత్ రెడ్డి నయమే కదా? రెండు వేలు ఎక్కువే కదా?
రైతుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి;
ఎన్నికల సమయంలో అన్నిరాజకీయ పార్టీలు అలివి కాని హామీలు ఇస్తాయి. ఆ హామీలను విని ప్రజలు పట్టం కడతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార పార్టీ గత ప్రభుత్వం పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా ఒక్కటే. గత ప్రభుత్వాలు చేసినఅప్పుల కారణంగా తాము సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ప్రజలకు అవన్నీ అనవసరం. ఎన్నికలకు ముందు అప్పుల గురించి ముందే తెలిసినా ఎన్నికల ప్రచారంలో మాత్రం హామీలు ఇచ్చి ఇప్పుడు కోత పెట్టడం పై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పది వేల రూపాయలతో కలిపి తాము పది వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద త్వరలోనే రైతులకు సాయం అందిస్తామని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా అదే మాదిరి నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కలిపి రాష్ట్ర నిధులను చేర్చిరైతులు సాయం అందచేసింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో రైతు లకు పెట్టుబడి సాయాన్ని పదివేలు కేంద్రం ఇస్తే పది వేలు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే పదివేల రూపాయలు కోత పెట్టారని రైతులు అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం కూడా...
నాడు వైసీపీ ప్రభుత్వం కూడా అప్పట్లో ఆరువేలు కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు వేల రూపాయలను కలిపి పన్నెండు వేల రూపాయలను రైతులకు చెల్లించేది. కానీ చంద్రబాబు ఇరవై వేల రూపాయలు సాయం చేస్తామని ప్రకటించడంతో గత ఎన్నికల్లో రైతులందరూ కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు తమ ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలను మాత్రమే రైతులకు ఇవ్వడమేంటన్న ప్రశ్నఎదురవుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక్కసారిగా పదివేల రూపాయలకు పెంచింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పెంచకపోతే చంద్రబాబు ఇచ్చేవారు కాదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే తమది కూటమి ప్రభుత్వం కాబట్టి రెండు పార్టీలూ కూటమిలో ఉన్నాయి కాబట్టి తాము కలసి సాయం అందచేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో మాత్రం...
మరొక వైపు తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రైతులకు పన్నెండు వేల రూపాయలు ప్రకటించారు. కేవలం రైతులకు మాత్రమే కాదు వ్యవసాయకూలీలకు కూడా సాయం అందచేస్తామని ప్రకటించారు. తెలంగాణలో రైతులకు అదనంగా రెండు వేల రూపాయలు అందుతున్నాయి. తెలంగాణలోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పది వేల రూపాయలు ఇస్తుండగా, రేవంత్ రెడ్డి సర్కార్ పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది. అంటే ఇక్కడ అదనంగా రెండు వేల రూపాయలు చెల్లిస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. అయితే దానిని మూడు వేల రూపాయలు తగ్గించిందన్న విమర్శలు కూడా విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ లో రైతులకు అదనంగా రెండు వేల రూపాయలు రైతు భరోసా నిధులు జమ అవుతుండటంతో ఏపీ కంటే తెలంగాణాయే బెటర్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంటే చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డి బెటర్ అంటూ కొందరు నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ