Andhra Pradesh : అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్ .. ఇక పనులన్నీ వేగంగానే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో పనులు ఇక వేగంగా ప్రారంభమై అంతే వేగంగా పూర్తి కానున్నాయి. మూడేళ్లలో తాము అనుకున్న పనునలను పూర్తి చేయాలని భావించిన చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచేందుకు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా, రహదారుల సౌకర్యం కూడా ఏర్పాటు చేసి రాజధాని అమరావతికి రూపు రేఖలు తేవాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా నిధులను సమీకరించి మరీ ఈ నెలలో టెండర్లను ఖరారు చేసి వచ్చే నెల నుంచి పనులను మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
కేబినెట్ ఆమోదం...
అందులో భాగంగానే అమరావతి రాజధానిలో మొత్తం ఇరవై ఇంజనీరింగ్ పనులకు 8821 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనులు చేపట్టేందుకు 24, 316 కోట్ల రూపాయల మంజూరు ప్రతిపాదనకు ఆమోదించారు. 176 మంజూరు కేడర్ స్ట్రెంత్‌ను నూతనంగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలు మున్సిపాలిటీలకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆమోదం తెలిపారు. ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి 11 వేల కోట్ల రూపాయలు కేఎఫ్ డబ్ల్యు నుంచి 16 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి ఆమోదం లభించింది.దీంతో అమరావతి పనులకు ఇక నిధుల సమస్య కూడా ఉండదు.
వేగంగా పనులు...
అమరావతి పనులను ఎంత వేగంగా పూర్తి చేయగలిగితే అంత మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందమైన అమరావతిని రాష్ట్రప్రజలకు చూపించడానికి ఆయన తహతహలాడుతున్నారు. అందులో భాగంగానే వరసగా సీఆర్డీఏసమావేశాలను నిర్వహించడమే కాకుండా అధికారులను ఉరుకులు,పరుగులు పెట్టిస్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని ప్రధమ ప్రాధాన్యతగా తీసుకోవాలని చంద్రబాబు పదే పదే చెప్పడంతో ఇప్పుడంతా అమారావతి మయంగా మారింది. ముందు రాజధాని నిర్మాణం పూర్తయితే పెట్టుబడులు భారీగా వస్తాయని తద్వారా సంపద పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పుడు సంక్షే మ పథకాలను అమలు చేయడానికి వెసులుబాటు చిక్కుకుందని అనుకుంటున్నారు. అందుకే అమరావతికి అంత ప్రయారిటీని చంద్రబాబు ఇస్తున్నారు.