Tirumala : తిరుమలలో భారీ సంఖ్యలో భక్తులు...దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పెరిగారు. తిరుమలకు శుక్రవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.

Update: 2024-12-20 02:37 GMT

తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పెరిగారు. తిరుమలకు శుక్రవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. సహజంగా శుక్రవారం నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ వారం మొత్తం తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా టీటీడీకి భారీగానే సమకూరిందని అధికారులు చెబుతున్నారు. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడానికి కారణం ధనుర్మాసం కారణం కాగా, మరొకటి అయ్యప్పలు ఎక్కువ మంది శబరిమల వెళ్లి వస్తూ దర్శనం చేసుకుంటుండటంతో భక్తుల రద్దీ అధికంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అయితే టీటీడీ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా వారు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్వామి వారి దర్శనం త్వరితగతిన భక్తులకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు స్వామి వారి ప్రసాదాలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధం చేస్తున్నారు. తిరుమలలోని వసతి గృహాలు దొరకడం కూడా దుర్లభంగా మారింది. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాతనే వసతి గృహాలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నాయన్న అంచనాతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

గోవింద నామస్మరణలతో...
మరోవైపు తిరుమల వీధులన్నీ భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. మాడ వీధులతో పాటు అన్న ప్రసాదం సత్రం, లడ్డూల కౌంటర్ వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం కోసం పది కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి నాలుగు గంటల దర్శన సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,165 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,377 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చిదంని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News