Tirumala : తిరుమలకు శనివారం నాడు పోటెత్తిన భక్తలు.. దర్శన సమయం మాత్రం?

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2024-12-28 02:39 GMT

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. దాదాపు అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి అధిక సమయం క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీవారి సేవకులు క్యూ లైన్ లో ఉన్న వారికి మజ్జిగతో పాటు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా గంటల తరబడి క్యూ లో ఉన్నప్పటికీ వారికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలో దైవదర్శనం, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల విషయంలో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ ఎప్పటి కప్పుడు తీసుకుని జరుగుతున్న లోటు పాట్లను సరిచేసుకుని ముందుకు వెళుతున్నామని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. సంవత్సరాంతం కావడంతో ఈ ఏడాదిలో శ్రీవారిని దర్శనం చేసుకునే వారంతా ఈ మూడు రోజుల్లో వస్తారని, అందుకే భక్తులు ఎక్కువగా వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. వసతి గృహాల వద్ద కూడా నియంత్రణగా కేటాయింపు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు కూడా తమకు సహకరించాలని కోరుతున్నారు.


రద్దీ పెరగడంతో...

తిరుమలలో రద్దీ పెరగడంతో ఈ నెలలో స్వామి వారి ఆదాయం కూడా భారీగానే పెరిగింది. ఇక వచ్చే నెలలో వైకుంఠ ఏకాదశి ఉండటం, కొత్త ఏడాది ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటలకుపైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటలకు పైగానే పడుతుందని వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,715 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 24,503 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.






Tags:    

Similar News