సతర్వం పూర్తి చేయండి
కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ నిన్న రాత్రి సమావేశమయ్యారు
కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ నిన్న రాత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు సీఎం చర్చించారు.విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని జగన్ ఈ సందర్భంగా అమిత్ షాను కోరారు. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చిందని, విభజన జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని తెలిపారు. వీటిపై వెంటనే దృష్టిసారించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టును...
పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరారు. అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతిందని, డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసిందని జగన్ అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని షాను జగన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని, ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని జగన్ కోరారు. దీంతో పాటు పలు అంశాలపై ఆయన అమిత్ షాను కోరారు. నేడుకూడా మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.