Ys jagan : చంద్రబాబు హయాంలో అన్నీ స్కాంలే...ఒక్క స్కీం పేరు చెప్పండి
రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ముందుగానే ప్రభుత్వం డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తుందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచన చేయలేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామని, తగిన గిట్టుబాటు ధర కల్పించేలా చూస్తున్నామని చెప్పారు. దుర్భిక్ష ప్రాంతంలో ఎప్పుడైనా ఇన్‌పుట్ సబ్సిడీని ఇచ్చారా అంటూ వైఎస్ జగన్ పుట్టపర్తి సభలో ప్రశ్నించారు.
రైతులను ఆదుకునేందుకు...
పంట రుణాలను సున్నా వడ్డీ కింద ఇస్తున్నామని ఆయన తెలిపారు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సున్నా వడ్డీని ఎందుకు నీరుగార్చారని ఆయన నిలదీశారు. రైతన్నల బాగోగుల కోసం ఎంతో చేయాలని తాను ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. పాడి రైతులను కూడా ఆదుకుంటున్నామని తెలిపారు. అదనంగా ఆదాయం వచ్చేటట్లు చేస్తున్నామని చెప్పారు. 53 నెలల కాలంలో ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకే లక్షా 75 వేల కోట్ల రూపాయలను ఇచ్చామని తెలిపారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద 1976 కోట్ల రూపాయలను ఇచ్చామని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కింద 45 వేల కోట్ల రూపాయలను ఇచ్చామని ఆయన వివరించారు.
దోచుకుంది దాచుకోవడం కోసమే...
చంద్రబాబుకు అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదని, గజదొంగల ముఠాకు సాయం చేయడం కోసమేనని అన్నారు. దోచుకునేందుకు పంచుకునేందుకు ఈ దొంగల ముఠాకు అధికారం కావాలన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకం పేరు అయినా గుర్తొస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. గతం కన్నా తాము అప్పులు చేశామని, కానీ అవి పేదలకు పంచుతున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్ లేనని, స్కీమ్ లు లేవని ఆయన అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందన్నారు. అబద్ధాలు, మోసాలు నమ్మవద్దని, ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెప్తారని, కానీ వాటిని నమ్మి మోసపోవద్దని జగన్ కోరారు.