Tirumala : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత శుక్రవారం నుంచి ప్రారంభమయిన భక్తుల రాక ఆదివారానికి మరింత పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత శుక్రవారం నుంచి ప్రారంభమయిన భక్తుల రాక ఆదివారానికి మరింత పెరిగింది. ఇది ఊహించిందే. శ్రావణ మాసం కావడం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని ముందు నుంచి వేస్తున్న అంచనాలు నిజమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లన్నీ కిటికటలాడుతున్నాయి. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. దీంతో భక్తులు బయటే ఉండి తలనీలాలను సమర్పించి, స్నానాలను ముగించుకుని దర్శనానికి వెళుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బయట వరకూ వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
క్యూ లైన్లు బయట వరకూ...
ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రేపటికి కొంత రద్దీ తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగా సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. లడ్డూల కౌంటర్ వద్ద కూడా క్యూ లైన్ ఎక్కువ సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,521 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 40,152 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చింది.