Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. నేరుగా దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామి వారి దర్శనం సులువుగా జరుగుతుంది

Update: 2024-10-28 03:10 GMT

tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామి వారి దర్శనం సులువుగా జరుగుతుంది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే దర్శనం గత కొద్ది రోజుల నుంచి లభిస్తుంది. దీపావళి వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల వరసగా ఏపీలో తుపాన్లు, భారీ వర్షాల హెచ్చరికలతో పాటు రైళ్లు రద్దు వంటి కారణాలతో భక్తుల రాకపోకలు తిరుమలకు తగ్గాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ముందుగా బుక్ చేసుకున్న భక్తులు తప్పించి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడం లేదు. అన్నీ వెంటనే భక్తులకు అందుబాటులోకి వస్తున్నాయి. తలనీలాలను సమర్పించే వద్ద కూడా రష్ లేదు. ఎక్కడ చూసినా ఖాళీ వీధులే దర్శనమిస్తున్నాయి. దీపావళి ఆస్థానం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సిఫార్సు లేఖలను కూడా తీసుకోమని ముందుగానే ప్రకటించారు.

రద్దీ తగ్గడానికి...
తిరుమలలో గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,333 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,606 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News