Duvvada Srinivas : ఇక రాజకీయం ఎందుకు దువ్వాడా? ఇంత రచ్చేమిటి తండ్రీ?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం రచ్చ కెక్కింది.

Update: 2024-08-10 06:04 GMT

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం రచ్చ కెక్కింది. ఆయన భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు తమకు ఇంట్లోకి అనుమతించాలంటూ పట్టుబడుతున్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న హైడ్రామాకు మాత్రం తెరపడటం లేదు. దువ్వాడ శ్రీనివాస్ తో వాణి వివాహమయింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఇద్దరూ విడిపోయి ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకు ముందు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. ఓటమి పాలు కావడంతో ఆయనకు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత 2024 ఎన్నికల్లో టెక్కలి సీటును కూడా దువ్వాడ శ్రీనివాస్ కే జగన్ కేటాయించారు.

అధికారంలో ఉన్నంత వరకూ...
అయితే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ ఫ్యామిలీ గొడవలు బయటకు రాలేదు. 2024 ఎన్నికలకు ముందు టెక్కలి నియోజకవర్గం టిక్కెట్ ను దువ్వాడ వాణికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఆమెను టెక్కలి ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ పట్టుబట్టి తిరిగి తనకే టిక్కెట్ ను తెచ్చుకున్నారు మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో రచ్చ మొదలయింది. ఆయన భార్య వాణి పిల్లలు కలసి తమతో తండ్రి కలసి ఉండాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఇది టెక్కలిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయింది.
ఎమ్మెల్సీగా ఉండి...
ఒక ఎమ్మెల్సీగా ఉండి భార్యకు విడాకులు ఇవ్వకుండా దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నారని ఆయన భార్య వాణి ఆరోపిస్తున్నారు. ఆమె ట్రాప్ లో పడి తమను పూర్తిగా వదిలేశారంటున్నారు. తమ కుమార్తెలు పెద్దవారై వైద్య వృత్తిలో ఉన్నప్పటకీ వారు తండ్రి కోసం పరితపించి పోతున్నారన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తనపై అధికార పార్టీ చేసిన కుట్ర అని చెబుతున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై తన భార్య, పిల్లలను తన ఇంటి మీదకు ఉసి గొల్పులుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటు దువ్వాడ శ్రీనివాస్, అటు ఆయన భార్య వాణిలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు దువ్వాడ శ్రీనివాస్ వాణికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. దువ్వాడ వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది.


Tags:    

Similar News