ఫోన్ స్విచాఫ్ చేసిన పిన్నెల్లి... మొదలయిన అసంతృప్తి

కొత్త మంత్రివర్గ జాబితా రూపొందిన క్రమంలో అధికార వైసీపీలో అసంతృప్తులు మొదలయ్యాయి

Update: 2022-04-10 12:08 GMT

కొత్త మంత్రివర్గ జాబితా రూపొందిన క్రమంలో అధికార వైసీపీలో అసంతృప్తులు మొదలయ్యాయి. తమమ పేరును కనీసం పరిశీలించక పోవడం, నమ్మకంగా పార్టీలో తాము కొనసాగిన విధానాన్ని పార్టీ నాయకత్వం గుర్తించకపోవడం పట్ల కొందరు అసంతృప్తికి గురవుతున్నారు. చిలకూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి మంత్రి పదవి ఇవ్వవద్దంటూ ఒక వర్గం గట్టిగా పట్టుపడుతుంది. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి నిరసనగా ఆయన అనుచరులు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ల పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

బాలినేని అసహనం....
సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయగా, మీరు ప్రభుత్వం చూపిన అభిమానానికి థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేశారు. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన ఫోన్ ను స్విచాఫ్ చేశారు. మాజీ మంత్రి బాలినేని కూడా అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ప్రకాశం జిల్లాకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఇలాగైతే జిల్లాలో పార్టీ ఎలా నడపగలమని ప్రశ్నించినట్లు తెలిసింది. బాలినేనిని బుజ్జగించేందుకు స్వయంగా సజ్జల ఆయన ఇంటికి వెళ్లారు.
కోపంగా కోటంరెడ్డి....
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. వైసీపీలో ముందునుంచి తనకు ప్రాధాన్యత లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింద.ి రేపటి నుంచి నియోజకవర్గంలో తలపెట్టిన గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అనేక మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రానున్న రోజుల్లో తమ అసంతృప్తిని వెల్లడించే అవకాశముంది.


Tags:    

Similar News