ఎంత సాహసం.. 50 కిలోల టమాటాలతో కూతురి తులాభారం
తాజాగా ఓ తండ్రి తన కూతురికి టమాటాలతో తులాభారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. మన ఆంధ్రప్రదేశ్ లోనే..
టమాటా.. ఇప్పుడిది సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిన పండు. ప్రతి కూరలోనూ ప్రధానంగా ఉండే టమాటా.. ఇప్పుడు కిలో రూ.120 నుంచి రూ.200 వరకు పలుకుతుండటంతో.. అది లేకుండా వంటలు ఎలా చేయాలో యూట్యూబ్ లో తెగ వెతికేస్తున్నారు. ఇక టమాటా పచ్చడి, టమాటా రసం, సాంబార్ లలో టమాటాల ఊసే మరిచిపోవాల్సిన స్థితి. సామాన్యులకు ఇది భారంగా మారినా.. టమాటా రైతుల పాలిట మాత్రం బంగారంలా కనిపిస్తుంది. వందల కిలోల కొద్దీ టమాటాలు అమ్మి.. కొందరు రైతులు వారం నుంచి 10 రోజుల్లోనే కోటీశ్వరులైన ఘటనలున్నాయి.
తాజాగా ఓ తండ్రి తన కూతురికి టమాటాలతో తులాభారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. మన ఆంధ్రప్రదేశ్ లోనే అనకాపల్లి జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో నగరానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహినీ దంపతుల కుమార్తె భవిష్యకు బంగారం (బెల్లం)తో తులాభారం మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. అయితే.. ఇప్పుడు బెల్లంకంటే టమాటాలే బంగారంలా చూస్తుండటంతో.. తొలుత వాటితోనే తులాభారం నిర్వహించారు. సుమారు 40 నుంచి 50 కిలోల టమాటాలతో తులాభారం నిర్వహించినట్లు సమాచారం.
ఆ తర్వాత బెల్లం, పంచదార వంటి పదార్థాలతో తులాభారం నిర్వహించారు. తులాభారం నిర్వహించిన టమాటాలు, బెల్లం, పంచదారలను దేవస్థానానికి అప్పగించగా.. వాటిని నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ తులాభారాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. టమాటాల కోసం మినీ యుద్ధమే జరుగుతున్న ఈ రోజుల్లో.. టమాటాలతో తులాభారం నిర్వహించారంటే.. పెద్ద సాహసమే చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.