Balineni : బాలినేని రాజీనామాతో వైసీపీకి నష్టమేనా? అంత సీన్ ఉందా?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వైసీపీకి ఒకరకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వైసీపీకి ఒకరకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వల్ల రాజకీయంగా జరిగే నష్టం కంటే వైసీపీ లీడర్స్ ను మానసికంగా దెబ్బతీసే అవకాశముంది. ఎందుకంటే బాలినేని జగన్ కు దగ్గర బంధువు కావడమే ఇందుకు కారణం. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ఇప్పటికిప్పుడు జరిగే నష్టం అంటూ ఉండదు. అలాగే ఆయన చేరే పార్టీకి కూడా అదనపు ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే బాలినేనిపై ఒంగోలు నియోజకవర్గం ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి ఆయన వైఖరి కారణం. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నాలుగు సార్లు గెలిచించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత బలంతో మాత్రం కాదు. కేవలం నాడు వైఎస్, తర్వాత జగన్ వేవ్ లోనే ఆయన గెలవగలిగారన్నది ఎవరూ కాదనలేని సత్యం.
ప్రజలుకు అందుబాటులో...
బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడటానికి అనేక కారణాలున్నాయి. అయితే ఆయన గతకొంత కాలం నుంచి పార్టీ హైకమాండ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. బాలినేని ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండరన్న ఆరోపణలున్నాయి. ఆయన ఎప్పుడూ చెన్నై, హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటారన్న పేరుంది. ప్రజా సమస్యలను కూడా పట్టించుకోరన్న పేరుంది. అదే మొన్నటి ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వైఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు బాలినేనిని దగ్గర తీశారు. ఆయనకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఆయన తండ్రికి పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని కుటుంబం రాజకీయంగా ఎదగటానికి ప్రధాన కారణం వైఎస్ కుటుంబమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రకాశం జిల్లా రాజకీయాలు తెలిసిన వారందరికీ అది తెలుసు.
వైఎస్ కుటుంబంతోనే....
బాలినేనితో సమకాలికులుగా కాకుమాను రాజశేఖర్, మంత్రి శ్రీనివాసరావు వంటి నాడు యువనేతలు పోటీపడినా కేవలం వైఎస్ కుటుంబంతో బాంధవ్యం, సామాజికవర్గం ఆయనకు అండగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాను జగన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించానంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి తొలి రెండున్నరేళ్లు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎందుకు పెదవి విప్పలేదన్న సమాధానానికి ఆయన నుంచి సమాధానం రాకపోవచ్చు. జగన్ రెండో విడత మంత్రి వర్గ విస్తరణ చేపట్టినప్పుడు బాలినేనిని కూడా కేబినెట్ నుంచి పక్కన పెట్టారు. ఆయననే కాదు పేర్నినాని, కొడాలి నాని వంటి సమర్థులైన నేతలను కూడా తప్పించారు. అయినా బాలినేని మాత్రం నాటి నుంచి అసంతృప్తితో రగలి పోతున్నారు. వైసీపీని తన సొంత పార్టీగా భావించి తన మంత్రి పదవి పదిలం అని భావించిన బాలినేనికి నాడు జగన్ ఊహించని షాక్ ఇచ్చారు.
మొన్నటి ఎన్నికల్లో...
మరోవైపు మొన్నటి ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్ ఇవ్వమని బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. కానీ జగన్ ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉండటంతో టిక్కెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకు వచ్చారు. మంత్రిగా ఆదిమూలం సురేష్ ను కంటిన్యూ చేయడం, తనకు బంధువుగా ఉండి శత్రువుగా మారిన వైవీ సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించడమేకాకుండా, ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి, రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా బాలినేని కినుక వహించడానికి ఒక కారణం. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి ప్రధాన కారణం నియోజకవర్గాల పునర్విభజన. ఒంగోలులో తాను గెలవాలంటే కాపు సామాజికవర్గీయుల మద్దతు అవసరం. ఆయన రాజీనామాకు చెప్పే కారణాలన్నీ అందరూ నేతలకు జరిగేవే. మొన్నటి ఎన్నికల్లో హేమాహేమీలు ఓడిపోయిన విషయం బాలినేని విస్మరించినట్లున్నారు.
అసలు కారణం అదేనా?
వైసీపీలో ఉంటే కాపులు మద్దతివ్వరన్న భయం బాలినేనిలో ఉండవచ్చు. రానున్న ఎన్నికల్లో గెలవాలన్నా తాను జనసేనలో చేరడం ఉత్తమమని ఆయన భావించే ఈ రాజీనామా నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. అందుకే బాలినేని నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతున్నారు. జనసేనలో చేరి మరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల్లో గెలవాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరడానికే బాలినేని ఈ రాజీనామా అని చెప్పకతప్పదు. కానీ అన్ని ఎన్నికల్లో ఒకేలా ఉండవు. ప్రజల అభిప్రాయాలు మారుతుంటాయి. పార్టీ మారిన నేతలను ప్రజలు ఎంతమేరకు ఆదరిస్తారన్నది పార్టీలో సీనియర్ నేతగా బాలినేనికి తెలియంది కాదు. కానీ రాజకీయాలు అంతే. పదవులు లేకపోతే ఉండలేరు. అధికారం కోల్పోతే అరక్షణం కూడా ఆ పార్టీలో ఉండని నేతల్లో బాలినేని కూడా చేరిపోయారు. జగన్ కష్టకాలంలో అండగా ఉండాల్సిన సమయంలో బాలినేని పార్టీని వీడటం కూడా సొంత సామాజికవర్గం నుంచి ఆయనకు మద్దతు లభించకపోవచ్చు.