Amaravathi : ఉండవల్లి వాసులకు గుడ్ న్యూస్... ఎంత వరదొచ్చినా ఇక భయంలేదు
కృష్ణానది కరకట్టపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉండవల్లి కరకట్టను విస్తరించేందుకు సీఆర్డీఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు
కృష్ణానది కరకట్టపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉండవల్లిలో కరకట్టను విస్తరించేందుకు సీఆర్డీఏ అధికారులు ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రణాళికలను రచిస్తుంది. నాలుగు లేన్ల రోడ్లగా కరకట్ట పనులను విస్తరించే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వచ్చే నెలలో కరకట్ట విస్తరణ పనులకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అధికారులు రెడీ అవుతున్నారు. వీలయినంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
కరకట్ట నిర్మాణంతో...
ఇటీవల వరదలతో బెజవాడకు పెద్దయెత్తున వరద వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని నగరమైన అమరావతి కూడా వరద తాకిడి తట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని కరకట్టను పటిష్టపర్చడమే కాకుండా వరద నీరును తట్టుకునేలా రాజధాని అమరావతిని సిద్ధం చేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు.
టెండర్లు పిలవాలని...
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు పూర్తి కాకుండానే కరకట్ట నిర్మాణాన్ని చేపడితే తర్వాత భవన నిర్మాణ పనులకు టెండర్లు పిలవవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ ఆలోచన ప్రకారమే సీఆర్డీఏ అధికారులు తొలుత కరకట్ట పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. మొన్న ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అయితే పదిహేను లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా సీఆర్డీఏ ఈ కరకట్ట నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో అడుగులు వేయాలని భావించింది.