Rain Alert : ఏపీలో నేటి నుంచే భారీ వర్షాలు.. అలెర్ట్ అయిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి

Update: 2024-10-14 03:46 GMT

heavy rains in AP today

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. ఈరోజుఈశాన్య రుతుపవనాలు బలంగా కోస్తాంధ్తని తాకాయి. తెలవారుజామున నుంచే తిరుపతి నుంచి వైజాగ్ వరకు అన్ని ప్రాంతాల్లో వర్షాలు బలంగా పడుతున్నాయి. తిరుపతి - నెల్లూరు డివిజన్ లో భారీ వర్షాలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు, బాపట్ల బెల్ట్ లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నం - కాకినాడ - వైజాగ్ బెల్ట్ లో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు నేటి మధ్యాహ్నం వరకు కొనసాగనున్నాయి. ప్రత్యేకించి తిరుపతి - నెల్లూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత అత్యథికంగా ఉండనుంది. అన్నమయ్య​, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు ప్రారంభిస్తున్నాయి. దీంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

మత్స్యకారులు వేట నిషేధం...
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనంఏర్పడింది. దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఆ తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.బుధ,గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.
ఈ జిల్లాల్లో...
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదని, పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో తల దాచుకోవాలని సూచించిాంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
దేశ వ్యాప్తంగా...
దేశవ్యాప్తంగా తిరోగమనంలో నైరుతి రుతుపవనాలు పయనిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం నుంచి క్రమంగా రుతుపవనాలు వైదొలగుతున్నాయని చెప్పింది. వచ్చే రెండ్రోజుల్లో మరింత ఉపసంహరించుకునేలా ఉన్నాయని, దక్షిణభారతం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరం వైపు అల్పపీడనం కదిలే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.
Tags:    

Similar News