నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ !
రెండు రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో..
అమరావతి : హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవ్వనున్నాయి. రెండు రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేశారు. ఏపీలో నేటి నుంచి మే 24 వరకూ.. తెలంగాణలో మే 23వ తేదీ వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుకు పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి మొత్తం విద్యార్థులు 9,07,393 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టీయర్ 4,64,626 మంది, సెకండియర్ లో 4,42,767 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,64,626, సెకండియర్ విద్యార్థులు 4,42,767 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, ఇన్విజిలేటర్ల కదలికలను హైదరాబాద్ నుంచే పర్యవేక్షించేలా సీసీ కేమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యాసంవత్సరం 9,14,423 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. 87,435 మంది వృత్తి విద్య పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకై రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా.. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులు సమాధాన పత్రాలపై పేరు, రిజిస్ట్రేషన్ నంబర్లు లాంటి వివరాలను అస్సలు రాయొద్దని ఇంటర్ బోర్డు సూచించింది. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే 18005999333 నంబరును సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. హాల్ టికెట్‌లో తప్పులు వచ్చిన, ఇతర అనుమానాలు, విధుల్లో ఉన్న సిబ్బంది కోసం 040-24600110 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని తెలిపింది. ఈ నంబర్లు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ.. మే 24 వరకూ అందుబాటులో ఉంటాయి.