Ys Jagan : జగన్ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా? క్షవరం అయినా వివరం తెలియలేదా?

వైఎస్ జగన్ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా మారలేదన్నది అర్థమవుతుంది

Update: 2024-08-01 07:36 GMT

వైఎస్ జగన్ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా మారలేదన్నది అర్థమవుతుంది. ఎదుటి పార్టీలు చేసే విమర్శలకు తగినట్లుగానే ఆయన అదే పంథాను కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవహరించిన తీరును ఆయన కొనసాగిస్తున్నారు. కనీసం ప్రజలు ఏమనుకుంటారోనన్న స్పృహ కూడా లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ బహిరంగంగా తప్పుపట్టరు. అదే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అదే రకమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ అదే పట్టనట్లు జగన్ వ్యవహరించడం చూస్తుంటే ఆయన తన తీరును మార్చుకోలేదనే అనిపిస్తుంది.

రెడ్డి సామాజికవర్గానికే...
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలనే ప్రాంతాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించారు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పుడు పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిధున్ రెడ్డిలను ప్రాంతాల వారీగా ఇన్‌ఛార్జులుగా నియమించారు. చివరకు ఎన్నికల సమయంలోనూ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు మిధున్ రెడ్డి, విశాఖ ప్రాంతానికి వైవీ సుబ్బారెడ్డి, కోస్తాంధ్ర ప్రాంతానికి సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయమై నేరుగా విమర్శలు కూడా చేశారు. అందరూ తన సామాజికవర్గానికి చెందిన వారికే పెత్తనం ఇచ్చారంటూ ఆయన ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ....
తాజాగా విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఇక్కడ వైసీపీ ఈ సీటును గెలుచుకునేంత బలముంది. వైసీపీకి ఆరువందలకు పైగా ఓట్లు ఉండగా, టీడీపీ కూటమికి 250 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గట్టిగా పోరాడితే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. మూడేళ్ల పదవీ కాలం ఉండే ఈ ఎమ్మెల్సీ పదవికి పోటీ బాగానే ఉంది. వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేనలోకి వెళ్లడంతో ఆయన పై అనర్హత వేటు పడటంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. టీడీపీ నుంచి గండి బాబ్జీని బరిలోకి దించాలనుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ నుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. కొందరు జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
వైవీ సుబ్బారెడ్డిని...
ఈ నేేపథ్యంలో మళ్లీ విశాఖ ప్రాంతానికి వైవీ సుబ్బారెడ్డిని పంపించడంతో అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో కాకలు తీరిన నేతలున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్‌తో పాటు బూడి ముత్యాలనాయుడు వంటి వారు మాత్రమే కాకుండా లోకల్ లీడర్స్ ఉన్నారు. వారికి ఎవరికో ఈ ఎమ్మెల్సీ బాధ్యతను అప్పగిస్తే లోకల్ ఫ్లేవర్ పార్టీలో ఉండే అవకాశాలున్నాయి. కానీ వైవీ సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చెలాయిస్తున్నారని అధికార పక్షం విమర్శించే అవకాశాలన్నాయి. ఆ ఛాన్స్ జగన్ టీడీపీ కూటమికి ఇచ్చేశారు. ఇలా జగన్ దారుణమైన దెబ్బను రాజకీయంగా చవి చూసినా ఆయన తీరులో మార్పు రాలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అంటే అక్కడి నేతలపై నమ్మకం లేకనే వైవీని పంపించారని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News