Chandrababu : ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు రెడీ అయిపోయారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. జమిలి ఎన్నికలు 2027లో జరుగుతాయని ప్రాధమికంగా ఆయనకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు జమిలి ఎన్నికలపై సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దాని తర్వాతనే చంద్రబాబు మీడియా సమావేశంలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడారని పార్టీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నాయి. 2027 ఎన్నికలకు సిద్ధమవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఈలోపు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా తగిన సహాయ సహకారాలను అందిస్తుందని మోదీ చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది.
అందుకేనా ఆ ప్రకటన...?
దీంతో చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. పార్టీ నేతలకు ఇంకా ఈ సమాచారం చెప్పకపోయినప్పటికీ ముఖ్య నేతలతో మాత్రం ఆయన ఈ విషయాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్లు తెలిసింది. అందుకే జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూ ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రకటన చేశారంటున్నారు. జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఎన్నికల కోడ్ పనులకు అడ్డురాదని, పాలన కూడా సాఫీగా సాగిపోతుందని తెలిపారు. అంటే ఆయన మానసికంగా జమిలి ఎన్నికలకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. దీంతో ఏపీలో 20227లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
సేమ్ కాంబినేషన్ లో...
2027లో జరిగే ముందస్తు ఎన్నికల్లోనూ సేమ్ కాంబినేషన్‌తో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే మళ్లీ విక్టరీ రిపీట్ చేయవచ్చని భావిస్తున్నారు. 2026లో ఎటూ పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల పెంపు జరుగుతుంది కాబట్టి ఇక సీట్ల విషయంలో కూడా కూటమి పార్టీలు పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ముఖ్యమైన నేతలందరికీ సీట్లు ఇవ్వవచ్చన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. మిత్ర పక్షాలు కూడా ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఓట్ల బదిలీకి గత ఎన్నికలలో మాదిరిగా క్యాడర్ పనిచేస్తుందన్న నమ్మకంతో టీడీపీ చీఫ్ ఉన్నారు.
రెండేళ్లు ముందుగానే...
వాస్తవానికి ఏపీలో ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ రెండేళ్లు ముందుగానే ఎన్నికలు జరగనున్నాయని తెలిసింది. ఇక ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నది మూడేళ్ల సమయం మాత్రమే. ఈ మూడేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల్లో విశ్వసనీయతను మరింత పెంచుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా హామీల అమలు కోసం క్యాలెండర్ ను రూపొందించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఇక పాలనలోనూ, హామీల అమలులోనూ చంద్రబాబు స్పీడ్ పెంచనున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.