Ys Jagan : ఇప్పుడు చేయాల్సింది ధర్నాలు కాదయ్యా సామీ.. అసలు విషయం ఇదీ?
ఎన్నికల ఫలితాలు వచ్చి 45 రోజులవుతుంది. అయితే వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో పార్టీపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చి నలభై ఐదు రోజులు దాటుతుంది. అయితే వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో పార్టీపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అంతా హోల్ అండ్ సోల్ తానే చేయాలన్న రీతిలోనే ఆయన వైఖరి కనపడుతుంది. వైసీీపీ అధినేతగా జగన్ చరిష్మాను ఎవరూ కాదనలేరు. ప్రజల్లో ఇప్పటికీ బలమైన నేతగానే జగన్ కు గుర్తింపు ఉంది. జగన్ ఇప్పటి వరకూ తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలోనూ, మొన్న వినుకొండ నియోజకవర్గంలోనూ పర్యటిస్తే పార్టీ అధినేతను చూసేందుకు పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఖచ్చితంగా ప్రజల్లోనూ, క్యాడర్ లోనూ జగన్ నాయకత్వంపై నమ్మకం అయితే ఇప్పటికీ అలాగే ఉంది.
అభిమానం మాత్రం....
ఓటమికి జగన్ పాలన వైఫల్యం కాదని ఇప్పటికీ అనేక మంది కార్యకర్తలు నమ్ముతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫలితాలు రావడానికి ఏదో జరిగిందన్న అనుమానాలను కూడా సోషల్ మీడియాలో కూడా వ్యక్తం చేస్తుండటం కనిపిస్తుంది. అంటే జగన్ మంచి పాలనను అందించినా ప్రజలు ఓటేసినా ఓటమి పాలయ్యారన్న అభిప్రాయమే క్యాడర్ లో మాత్రం బలంగా కనపడుతుంది. అందుకే జగన్ పై ఇప్పటికీ అభిమానం తగ్గలేదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు పెద్దయెత్తున బయటకు వెళ్లకపోవడం కూడా ఇదే కారణమని చెప్పాలి. ఎందుకంటే చోటామోటా నేతలు ఊహించిన స్థాయిలో మాత్రం పార్టీని వదిలి వెళ్లడం లేదు.
జెండాను మార్చేందుకు...
అందుకు ప్రధాన కారణం పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు కాకపోతే మరొకసారి తమకు ఏదో ఒక పదవి వస్తుందన్న నమ్మకంతో జగన్ వెంట నడవాలన్న నిర్ణయంతో ఉన్నారు. దీంతోపాటు ఫుల్లుగా నిండిపోయిన టీడీపీలోకి వెళ్లినా చేసేదేమీ లేదన్న కారణం కూడా మరొకటి కావచ్చు. నేతలు మరో ఐదేళ్లు ఓపిక పట్టడానికే రెడీ అయిపోతున్నారన్నది గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. పెద్దగా నియోజకవర్గాల్లో యాక్టివ్ గా లేకపోయినా జెండాను మార్చేందుకు మాత్రం ఎవరూ పెద్దగా ఇష్టపడటం లేదు. ఇక జగన్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమయింది.
క్యాడర్ ను దరిచేర్చుకోవడం...
అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య ఉన్న విభేదాలే కొన్ని చోట్ల ఓటమికి కారణమయ్యాయి. అయితే అప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని విభేదాల పరిష్కారం బాధ్యతను సీఎంవో అధికారులకు, సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. కానీ నేతల మధ్య మాత్రం విభేదాలు ఏ మాత్రం తొలగలేదు. ముందుగా ప్రతి నియోజకవర్గంలో నేతలను పిలిపించుకుని అక్కడ, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తాను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే వలసలు ఆగడమే కాదు. సమన్వయంతో అందరూ కలసి పనిచేస్తారు. ఇప్పుడు జగన్ చేయాల్సింది ఢిల్లీలో ధర్నాల కన్నా పార్టీని బలోపేతం చేయడంపైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే దూరమైన క్యాడర్ ను కూడా తిరిగి దరి చేర్చుకోవడం ముఖ్యం.