Pawan Kalyan : పవన్ పై హోప్స్ సన్నగిల్లుతున్నాయా? డిఫెన్స్ లో పడిపోయారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు;

Update: 2025-03-17 06:28 GMT
pawan kalyan,  jana sena chief, hopes, ap politics
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు. లక్ష్యం కూడా ఎంత దూరంలో ఉందో తెలియదు. ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ ను చూడాలని కాపు సామాజికవర్గం, పవన్ అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అటువంటి ఆలోచన లేకపోవడంపై వారిలోనే చర్చ జరుగుతుంది. తాము అనుకున్నది వేరని, ప్రతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కాపు సామాజికవర్గానికి చెందిన వారుంటారని, ఇక పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చినందుకు ప్రత్యేకంగా సాధించింది ఏముందన్న ప్రశ్న ఆ సామాజికవర్గం నుంచి ఈ మధ్య కాలంలో బలంగా వినిపిస్తుంది.

వైసీపీని విమర్శిస్తూ...
వైసీపీ విమర్శలు చేస్తూ కాలం గడిపేసే రోజులు పోయాయి. ఎందుకంటే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలుపై కూడా పవన్ కల్యాణ్ ప్రశ్నించకపోవడంతో పాటు టీడీపీకి బలమైన మద్దతుదారుగా మారడాన్ని కూడా జనసేన కార్యకర్తల నుంచి సామాజికవర్గం నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఊహించింది ఒకటి.. జరుగుతున్నదొకటిలా తయారయిందన్న నిరాశ నిస్పృహలు వారిలో కనిపిస్తున్నాయి. అయితే తాము ఏ మాత్రం దాచుకోకుండా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టేస్తున్నారు. పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని చేసిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యల దగ్గర నుంచి ఇటువంటి పరిస్థితి తలెత్తింది.
జోగయ్య కూడా...
ఇక కాపు, బలిజ సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య కూడా పవన్ కల్యాణ్ ను నేరుగా తప్పుపడుతూ బహిరంగ లేఖను రాస్తున్నారు. ఇది కొంత పవన్ తో పాటు జనసేనకు కూడా ఇబ్బందికరంగా మారింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్న ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ పెదవి విప్పకపోవడంపై జనసేన అధినేత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని నిర్మాణం అనేది దశల వారీగా జరగాలని, అంతే తప్ప నిధులన్నీ అక్కడ వెచ్చించి మిగిలిన ప్రాంతాలకు, సంక్షేమ పథకాలను అందించకుండా ప్రజలను మోసం చేయడం కాదా? అని కాపు నేతలే ప్రశ్నిస్తున్నారు.
ఇరకాటంలో పెట్టేదే...
ఇది కొంత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలో పెట్టేదే. ఎందుకంటే పవన్ కల్యాణ్ పై ఎన్నికలకు ముందు వరకూ ఎన్నో హోప్స్ ఉన్నాయి. 2014 నుంచి ఆయన ప్రసంగాలు, ఆవేశపూరిత పంచ్ లు విని ఊగిపోయిన వారు నేడు జరుగుతున్న తీరు చూసి ఉసూరుమంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనే అర్థమవుతుంది. ఎఫెన్స్ లో ఉంటేనే పవన్ కల్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది తప్పించి, డిఫెన్స్ లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజీ అవ్వకతప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుందని అంచనా వేసిన వారికి నేడు ఆయన నుంచి వస్తున్న స్పందన చూసి డల్ అయినట్లే కనిపిస్తుంది.


Tags:    

Similar News