అన్యాయంపై పోరాడి అలసిపోయా

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు విజయవాడలోని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Update: 2023-05-28 16:25 GMT

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు విజయవాడలోని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమం కాస్త టీడీపీ విమర్శల కార్యక్రమంగా మారినట్లు సభా వేదిక తయారైంది. తెలుగు దేశంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సేవలు మొదలుకొని, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలంటూ విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మిపార్వతి ప్రసంగించారు. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు టార్గెట్‌గా ప్రసంగం స్టార్ట్ చేసిన ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి అలసిపోయానని, తన ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదని మాట్లాడారు. ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారని, కడుపున పుడితే వారసులు కాదు, ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులని తెలిపారు. ఎన్టీఆర్‌ చివర క్షణాల్లో అండగా ఉంది కేవలం దేవినేని నెహ్రూ మాత్రమే అని.. ఆయనే ఎన్టీఆర్‌కు అసలైన వారుసడని లక్ష్మిపార్వతి అన్నారు.

ఇక ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తుల్లో చంద్రబాబు మొదటి వరుసలో ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన దుర్మార్గులు వారసులెలా అవుతారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధకు లోనయ్యారని లక్ష్మిపార్వతి అన్నారు. మొదటి నుంచి చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారమే చేశారన్నారు. ఎన్టీఆర్ ఫొటో కానీ, ఫొటో కానీ పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు లక్ష్మిపార్వతి. క్లిష్ట సమయంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనకు ధైర్యానిచ్చారని సభా ముఖంగా తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో తన పాత్ర గురించి అందరికీ తెలిసేలా చేశారన్నారు.

Tags:    

Similar News