Kodali Nani : భయపడే ప్రసక్తే లేదు.. దేనికైనా సిద్ధమన్న కొడాలి
ఇచ్చిన హామీల నుంచి ప్రజలను పక్కదోవపట్టించేందుకే చంద్రబాబు పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని కొడాలి నాని అన్నారు;
ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను పక్కదోవపట్టించేందుకే చంద్రబాబు పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని కొడాలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నెలకు మూడు వేల భృతిని కూడా ఇవ్వాలని కొడాలి నాని కోరారు. గతలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్ పై కొందరు అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు.
దుష్ప్రచారం చేస్తూ...
అవసరమైతే ఫర్నీచర్ వెనక్కు ఇస్తామని, లేెకుంటే అందుకు ఖర్చయిన డబ్బులు చెల్లించడానికి కూడా సిద్ధమని కొడాలి నాని అన్నారు. అలాంటి అసత్య ప్రచారాలతో హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుషికొండలో నిర్మించిన భవనం జగన్ సొంత ఆస్తి కాదన్న కొడాలి నాని, జగన్ ఎప్పుడూ ప్రభుత్వ భవనంలో ఉండలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అవసరమైతే విశాఖలో జగన్ సొంత భవనం నిర్మించుకుంటారని చెప్పారు. వీవీఐపీలు వస్తే అక్కడ ఉండటానికి మాత్రమే రుషికొండ భవనాన్ని నిర్మించామని చెప్పిన కొడాలినాని తాము దాడులకు భయపడేది లేదని తెలిపారు.