Ambati Rambabu : సాగర్ పై దుష్ప్రచారం తగదు.. మా వాటా నీటిని మాత్రమే
సాగర్ జలాల విడుదల విషయంలో తాము సక్రమంగా విధులను నిర్వర్తించామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
సాగర్ జలాల విడుదల విషయంలో తాము సక్రమంగా విధులను నిర్వర్తించామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని ఆయన అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు రెచ్చగొట్టి ఈ ఘటనను వివాదాన్ని చేయాలని చూస్తున్నారన్నారు. సాగర్ పై దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీ హక్కును కాలపాడుకునే ప్రయత్నం చేశామని అంబటి రాంబాబు తెలిపారు. మన ప్రాంతంలో మనకు రావాల్సిన నీరును ఏపీ ప్రభుత్వం విడుదల చేయడంలో తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
విభేదాలు సృష్టించవద్దు...
తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆయన కోరారు. తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకే తాము రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీరు అందించేందుకే నీటిని విడుదల చేసుకున్నామన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం వాటా ఉందన్నారు. తమ వాటా ప్రకారమే తాము వాడుకుంటున్నామని తెలిపారు. మా భూభాగంలో మా కెనాల్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. తాగునీటి అవసరాల కోసం తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పనిలేదన్నారు.