Nagababu : నాగబాబుకు పోస్టు రిజర్వ్ అయిందా? ఆ పోస్టుకు పేరు కన్ఫర్మ్ అయినట్లేనట

మొన్నటి ఎన్నికల్లో నాగబాబు పార్టీ విజయానికి కృషి చేశారు. ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు

Update: 2024-08-09 05:35 GMT

జనసేన అధికారంలోకి రావడానికి అనేక మంది కృషి చేశారు. అందులోనూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు అనేక మంది ఆయనకు అండగా నిలిచారు. అందులో పవన్ సోదరుడు నాగబాబు ఒకరు. నాగబాబు పార్టీలో కీలక భూమిక పోషించారు. మెగాస్టార్ అభిమానులందరినీ ఎన్నికల వేళ అందరినీ ఒక్కటి చేయగలిగారు. కాపు సామాజికవర్గంలోనూ చీలిక రాకుండా అన్ని జిల్లాల్లో సమావేశాలను ఏర్పాటు చేసిన నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. మెగా కుటుంబంలో ఎవరూ పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోయినా నాగబాబు మాత్రం పవన్ గెలుపునకు చేసిన కృషిని ఎవరూ మరవలేరు.

పార్టీ విజయం కోసం...
2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి జనసేన తరపున పోటీ చేసిన నాగాబాబు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత2024 లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసమే ఆయన రేయింబవళ్లూ పనిచేశారు. పిఠాపురంలోనే మకాం వేసి పవన్ కల్యాణ్ కు అత్యధిక మెజారిటీ వచ్చేలా నాగబాబు చేసిన కృషికి జనసేన నేతలు కూడా ప్రశంసలు అందించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ బిజీగా ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలను అంతా తానే భుజాన వేసుకుని, పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పవన్ కు మాట రాకుండా నాగబాబు చేయగలిగారు.
టీటీడీ ఛైర్మన్ పదవి అంటూ...
అయితే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఎంతగా అంటే ఆయనే ఇక టీటీడీ ఛైర్మన్ అన్నంతగా. అయితే దీనిని నాగబాబు ఖండించారు. అలాంటి ప్రతిపాదన లేదని, అటువంటి ఆలోచన కూడా లేదని నాగబాబు స్పష్టం చేసి టీటీడీఛైర్మన్ పదవిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో నాగబాబు చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే, హైదరాబాద్ టు మంగళగిరి ప్రయాణం చేస్తూ పార్టీ కార్యకర్తలను ఆయనే స్వయంగా కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
మరోసారి ప్రచారం...
కానీ తాజాగా నాగాబాబుకు నామినేటెడ్ పదవి ఇస్తారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. టీడీపీ కూటమి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుండటంతో అందులో జనసేన వాటా కూడా ఉండటంతో ఈసారి నాగబాబు పేరును పవన్ కల్యాణ్ కన్ఫర్మ్ చేస్తారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి పదవులు కాకుండా నామినేటెడ్ పోస్టు ఇస్తే ఇక్కడే ఉండి తనకు తోడుగా ఉంటారని పవన్ భావిస్తున్నారు. అందుకోసమే నాగబాబుకు ఒక పదవిని రిజర్వ్ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయనకు ఇష్టమైన ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగబాబును నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి సోదరుడు అని దూరం పెడతారా? కష్టపడిన నాగబాబుకు పవన్ కీలక పదవి ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News