పుట్టింది ఎక్కడ? పెట్టింది ఎక్కడ?
నందమూరి తారకరామరావు పేరును కొత్త జిల్లాల్లో ఒకదానికి పెట్టారు. ఎన్టీఆర్ ను గౌరవించిన విధానం బాగానే ఉంది.
నందమూరి తారకరామరావు పేరును కొత్త జిల్లాల్లో ఒకదానికి పెట్టారు. ఎన్టీఆర్ ను గౌరవించిన విధానం బాగానే ఉంది. ఆయన పేరు పెట్టడంలో ఎటువంటి తప్పులేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సినీ నటుడిగా తెలుగు ప్రజల్లో ఆరాధ్య దైవంగా నిలిచి ఉంటే ఎన్టీఆర్ పేరిట ఒక జిల్లా ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు దశాబ్దాల కాలం నుంచి కోరుకుంటున్నారు. కానీ ఆయన అల్లుడు చంద్రబాబు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా జిల్లాకు పేరు పెట్టలేకపోయారు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పేరు పెట్టారు.
పెట్టడమయితే....?
కానీ పేరు పెట్టడమయితే పెట్టారు కాని రాంగ్ ప్లేస్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతాన్ని కృష్ణా జిల్లాగా ఉంచి, ఆయన పేరును విజయవాడ ప్రాంతంలో పెట్టడం పై అభ్యంతరాలు వినపడుతున్నాయి. నందమూరి తారకరామారావు పుట్టింది పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామం. అయితే ఈ ప్రాంతం మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంది. విజయవాడ కేంద్రంగా చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు.
సంబంధం లేని....
కృష్ణా జిల్లాలో పెడన, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలను ఉంచారు. అలాగే ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు కానున్ను జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికే ఆయన పేరు పెడితే బాగుంటుందని, మార్పులు చేయాలని పలువురు సూచిస్తున్నారు.