జగన్ కు చంద్రబాబు లేఖ.. వారిని కఠినంగా శిక్షించండి
యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో వారికి కేటాయించిన అసైన్డ్ భూముల్లో..
అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న వైసీపీ నేతలను అడ్డుకుంటూ.. నిరసనలు తెలిపిన దళితులపై ఆ నేతలు దాడికి పాల్పడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో అక్రమ మట్టితవ్వకాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని ఈ లేఖలో ఆరోపించారు. అందుకు నిరసనలు తెలుపుతున్న దళితులపై దాడి చేసి గాయపరిచారని మండిపడ్డారు. దళితులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సీఎం కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో వారికి కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ భూముల్లో స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో అక్రమంగా మట్టితవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. తవ్వకాలను నిరసిస్తూ జూన్ 3న దళితులు నిరసనలకు దిగగా.. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. తీవ్రగాయాలైన వారిని పోలీసులు సమీపంలో ఉన్న పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా 70 కిలోమీటర్ల దూంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని విమర్శించారు.