YSRCP : మారినోళ్లంతా... మేమింతే అంటున్నారుగా... ఇలాగయితే అక్కడ ఎలా?
వైఎస్సార్సీపీలో ఎన్నికలకు ముందు జరిగిన మార్పులు ఇప్పుడు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి.
వైఎస్సార్సీపీలో ఎన్నికలకు ముందు జరిగిన మార్పులు ఇప్పుడు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో వారంతా ఇప్పుడు తాడేపల్లి జగన్ నివాసం వైపు చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేయాలో తెలియడం లేదు. నియోజకవర్గాల వైసీపీ ఇన్‌ఛార్జులుగా ఎవరు ఉండాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు లేక క్యాడర్ ఇబ్బందులు పడుతుంది. ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వైసీపీ క్యాడర్ ఈ విషయంపై నేరుగా జగన్ కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు...
ఎన్నికలకు ముందు అనేక మంది వైసీపీ నేతలను నియోజకవర్గాలను మార్చారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మార్చారని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ తెలిపారు. దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో మంత్రులుగా ఉన్న వారిని, ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలను మార్చారు. దీంతో వారు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే గత ఎన్నికలలో దాదాపు మార్చిన చోటంతా ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాలను మార్చిన వారిలో ఏ ఒక్కరూ గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. అయితే వీరంతా అయిష్టంగా తమ సొంత నియోజకవర్గాలను వదిలి అధినాయకత్వం కేటాయించిన నియోజకవర్గాలకు తాత్కాలికంగా వెళ్లారు.
బదిలీ చేసిన చోటుకు...
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ వైపు వైసీపీ నేతలు చూడటం లేదు. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి యర్రగొండపాలెం లో 2019 ఎన్నికల్లో గెలిచిన ఆదిమూలం సురేష్ ను షిఫ్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన కొండపికి దూరంగా ఉన్నారు. యర్రగొండపాలెంలో మాత్రం కొత్త అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ గెలిచారు. ఇక సంతనూతలపాడు నుంచి అప్పటి మంత్రి మేరుగ నాగార్జును ను పోటీ చేయించారు. వాస్తవానికి ఆయన గుంటూరు జిల్లా వేమూరు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు వేమూరు నాగార్జున సంతనూతలపాడు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. 2019 లో పోటీ చేసి గెలిచిన సుధాకర్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో అక్కడ వైసీపీ ఇన్‌ఛార్జి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఇన్‌ఛార్జులు లేక...
ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆమె ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండటం లేదు. కనిగిరి నియోజకవర్గం నుంచి కందుకూరుకు బదిలీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. ఆయన ఇప్పుడు బెంగళూరులో తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి కంభాల జోగులును పాయకరావుపేటకు పంపారు. అక్కడ ఓడిపోవడంతో ఇటు రాజాం, అటు పాయకరావుపేటలను పట్టించుకునే నేత లేరు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల విషయంలో స్పష్టత ఇవ్వాలని క్యాడర్ కోరుతుంది.