Tirumala : వైకుంఠ నిలయంలో కొనసాగుతున్న రద్దీ.. కారణమిదే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2024-07-16 02:40 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శని, ఆదివారాలు దర్శనం కష్టమవుతుందని భావిస్తున్న భక్తులు మిగిలిన వారాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. శని, ఆదివారాలు మాదిరిగానే మిగిలిన వారాలు కూడా భక్తులు అత్యధికంగా రావడానికి ప్రధాన కారణమిదేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు సమ్మర్ హాలిడేస్ లో కంటే ఇప్పుడు స్వామి వారిని దర్శించుకుని వెళదామన్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వసతి గృహాలు దొరకడం కూడా ఆలస్యమవుతుంది.

31 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఉచితంగా అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,054 మంది దర్శించుకున్నారు. వీరిలో 26,239 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.72 కోట్ల రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ముందుగా బుక్ చేసుకుని వెళ్లిన వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులుండవు. అప్పటికప్పుడు అనుకుని వెళుతున్న భక్తులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News