Tirumala: తిరుమలకు వెళుతున్నారా.. తిరుచానూరు కూడా దర్శించుకోండి!

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో

Update: 2024-09-15 05:38 GMT

తిరుమలకు వెళ్లే భక్తులు చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా దర్శించుకోవడం చాలా మంచిది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఈరోజు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.

ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 16వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 15వ తేదీన అంకురార్పణ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 16వ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. ఆదేవిధంగా సెప్టెంబరు 16, 17, 18వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.

తిరుమలలో సెప్టెంబ‌రు 17వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంట‌లకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకువెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.


Tags:    

Similar News