Tirumala : నేడు తిరుమలలో దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

Update: 2024-09-16 03:23 GMT

tirumala

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని వీధులన్నీ భక్తులతో నిండిపోయి గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. వరస సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల పాటు స్వల్పంగా కనిపించిన భక్తుల సంఖ్య మళ్లీ రైళ్ల రాకపోకలు, రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది. అన్నప్రసాదం వద్ద, వసతి గృహాల వద్ద ఎక్కువ సమయం భక్తులు క్యూ లైన్లలో నిల్చోవాల్సి ఉంటుంది. నిన్న శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలోనే వచ్చారు. అయితే భక్తులకు సంఖ్యకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో ఉచితంగా అన్న ప్రసాదాలను, మంచినీటిని భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్నారు.

అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయాయి. బయట టీబీసీ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,626 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,138 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News