Tirumala : హమయ్య రష్ కొంత తగ్గినట్లే... దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూగానే ఉంది. సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వరస సెలవులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో ఇలా వరసగా భక్తుల రద్దీ పెరగడం ఇటీవల కాలంలో ఇదే మొదటి సారి అని అధికారులు కూడా చెబుతున్నారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చినా అందుకు తగినట్లు సౌకర్యాలను కల్పించేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్ లో ఉన్న భక్తులకు మాత్రమే కాకుండా బయట వేచి ఉన్న వారికి కూడా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులు ఇబ్బంది లేకుండా స్వామి వారి దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై కంపార్ట్‌మెంట్లలో....
ఒక్కసారిగా భక్తులు రద్దీ పెరగడంతో పాటు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. వాస్తవానికి ఇది సీజన్ కాకపోయినా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకున్న భక్తులకు మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,935 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.