Tirumala : ఎంతసేపు వేచి ఉన్నా.. కానరేవమయ్యా వెంకటేశా
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సోమవారం కూడా భక్తుల సంఖ్య పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సోమవారం కూడా భక్తులు ఎక్కువగా రావడంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. వసతి గృహాల కోసం కూడా గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. వసతి గృహాలు దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల తరలి రావడంతోనే ఈ రద్దీ ఏర్పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
31 కంపార్ట్‌మెంట్లలో...
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోని టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులు శ్రీవారి దర్శనానికి పదహారు గంటల సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,744 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,833 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.