Tirumala : వడ్డీ కాసుల వాడా.. కరుణించవయ్యా?

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

Update: 2024-06-24 02:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. గత నెల రోజుల నుంచి తిరుమల భక్తులతో కిటకిట లాడుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో పాటు వివిధ పరీక్ష ఫలితాలు తెలియడంతో తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో భక్తుల రద్దీ అధికంగా ఉందని చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

31 కంపార్ట్‌మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,455 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 31,251 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న వారికి టీటీడీ అన్న ప్రసాదం పంపిణీ చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది.


Tags:    

Similar News