Ap Elections : సిట్ దర్యాప్తు వేగవంతం.. రేపు సీఈసీకి నివేదిక సమర్పించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ ను పోలింగ్ అనంతరం జరిగిన దాడులపై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిట్ బృందం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీకి చేరుకుని విచారణ ముగించింది. స్థానిక అధికారుల నుంచి వివరాలను సేకరించింది. ఈ ఘర్షణలో ఎవరిపై కేసులు నమోదు చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అన్న దానిపై లోతుగా అధ్యయనం చేస్తుంది.
ఘర్షణలకు కారణాలపై...
ఈరోజు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో సిట్ బృందం పర్యటించి ఘటనకు బాధ్యులైన వార ఎవరన్న దానిపై విచారణ చేపట్టనుంది. మరో వైపు తాడిపత్రి చేరుకున్న సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాలను, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ లను పరిశీలించింది. రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.