Chandrababu : పెట్రోల్, గ్యాస్ ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గంలో జరిగిన సభలో వైసీపీ చీఫ్ జగన్ పై విమర్శలు చేశారు
పెట్రోలు, గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరిగాయో చూశారా? తన హయాంలో ఈ ధరలున్నాయా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తునిలో జరిగిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఘనత జగన్‌ది అన్నారు. ఏ కుటుంబమూ ఈ ప్రభుత్వం బారిన పడి నష్టపోలేదని ఆయన ప్రశ్నించారు. విద్యుత్తు బిల్లులను కూడా విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చేంత వరకూ నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన తుని సభలో ప్రకటించారు.
నిత్యావసరాల ధరలు...
ఉప్పు, పప్పు, చింతపండు ధరలు తన పాలనలో ఎలాఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. యువత ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే లాభంలేదని, తొంభయి రోజులే సమయం ఉందని, సైకిలెక్కండి.. టీడీపీ, జనసేన జెండాలు పట్టుకుని ఊరంతా తిరిగి సునామీ సృష్టించాలని చంద్రబాబు కోరారు. యువత భవిష్యత్ కు తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. రైతు కోసం టీడీపీ, జనసేన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తామని తెలిపారు. బీసీలకు అండగా ఉండే పార్టీ టీడీపీ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి అని పిలుపునిచ్చారు.