ఎవరు పనిచేస్తే .. వారికి పదవులు
కరడు గట్టిన నేరగాళ్లు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే న్యాయం కోసం పోరాడాల్సి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
కరడు గట్టిన నేరగాళ్లు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే న్యాయం కోసం పోరాడాల్సి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ లీగల్ సెల్ ప్రమాణ స్వీకార సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవిభాగం వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఈరోజు ప్రజాస్వామ్యం కోసం పోరాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. తన 80 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. టీడీపీలో చదువుకున్న వారందరినీ చైతన్యం కోసం తీసుకొచ్చామని తెలిపారు. న్యాయ విభాగంలో పనిచేసిన కనకమేడల రవీంద్రకుమార్ ను రాజ్యసభ సభ్యుడిగా చేశామని తెలిపారు. అనుబంధ సంస్థలన్నీ పార్టీతో సమానంగా ఉండాలని భావిస్తున్నామని తెలిపారు.
పోలీసులు కొందరు...
సాక్షాత్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఈ పోలీసులు చితక్కొట్టారని తెలిపారు. ఎవరినైనా అన్యాయంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏపీకి రాలేని పరిస్థితిని కల్పించారన్నారు. ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశానని, నేరగాళ్లను కట్టడి చేసేంత వరకూ పోరాడతామని తెలిపారు. ఖబడ్దార్ జాగ్రత్త మీ గుండెల్లో నిద్రపోయే రోజు వస్తుందన్నారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారన్నారు. అమరావతి, పోలవరం ఈరోజు విధ్వంసానికి గురయ్యాయని అన్నారు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మూడు రాజధానులంటూ రాజకీయ లబ్ది పొందాలని భావిస్తున్నారన్నారు. చట్ట పరంగా సాధ్యం కాదని తెలిసినా దానిని తెరపైకి తెచ్చి ప్రాంతాలు, మనుషుల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. ఆ వలలో ఎవరూ పడొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరైతే పార్టీ కోసం ఈరోజు పనిచేశారో వారికే పదవులు ఇస్తామని ఆయన తెలిపారు.