Chandrababu : అభ్యర్థులను ప్రకటించం.. నేను, పవన్ చర్చించుకున్న తర్వాతనే ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన దెబ్బకు రెండడుగులు వెనక్కు వేసినట్లు కనపడుతుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన దెబ్బకు రెండడుగులు వెనక్కు వేసినట్లు కనపడుతుంది. అందుకే ఆయన వాయిస్ లో మార్పు వచ్చింది. సీట్లు ఇప్పుడే కాదంటూ పార్టీ నేతలకు సర్దిచెప్పారు. చంద్రబాబు ఇటీవల రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే.. దానికి కౌంటర్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు సీట్లలో తామే పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరకు, మండపేట రాకదలిరా సభల్లో అభ్యర్థులను ప్రకటించగా, పవన్ కల్యాణ్ రిపబ్లిక్ డే రోజు రాజానగరం, రాజోలు నియోజకవర్గంలో తామే పోట ీచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్టేజిపైకి దూసుకు వచ్చి...
అయితే ఈరోజు రాజమండ్రిలో జరిగిన రా కదలిరా సభకు వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ నేతల నుంచి వత్తిడి ఎదురయింది. రాజానగరం సీటు టీడీపీ కే కేటాయించాలని, ప్రకటన చేయాలంటూ ఆ నియోజకవర్గం కార్కకర్తలు నినాదాలు చేశారు. ఒక దశలో నేతలు సభా వేదికపై తోసుకోవడంతో చంద్రబాబు కిందపడపోయారు. దీంతో ఆయనను సిబ్బంది కాపాడారు. రాజానగరం నుంచి తమ నేతకు టిక్కెట్ ఇవ్వాలంటూ బొడ్డు వెంకట రమణ వర్గీయులు వీరంగం చేశారు. స్టేజీపైకి దూసుకు వచ్చి నినాదాలు చేశారు. వారిని శాంతింప చేయడానికి నేతలకు తల ప్రాణం తోకకు వచ్చింది. చంద్రబాబు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరం కలసి...
తాము ఎవరికీ సీట్లను ఖరారు చేయబోమని, పొత్తులో ఉన్న పార్టీలు కూర్చుని చర్చించిన తర్వాత మాత్రమే అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. అప్పటి వరకూ వేచి ఉండాలని, ఓపిక పట్టాలని చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి రూరల్ లో జరిగిన రా కదలిరా సభకు ఇటు టీడీపీ, అటు జనసేన కార్యకర్తలు పెద్దయెత్తున తరలి రావడంతో చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. అందరం కలసి పనిచేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపు నిచ్చారు. టిక్కెట్ కోసం కొట్లాటకు దిగడం కరెక్ట్ కాదని, పవన్ కల్యాణ్, తాను కలసి కూర్చుని చర్చించుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన స్పషగం చేశారు.