ఢిల్లీకి నారా లోకేష్
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బయల్దేరారు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బయల్దేరారు. గురువారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో లోకేష్ పోరాటం చేయనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు జాతీయ స్థాయిలో వివరించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు నారా లోకేష్. ఆయన వెంట శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. తన పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకుంటారని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.