సండే... రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. వీకెండ్ కూడా రష్ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడకుండాశ్రీవారిని దర్శించుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. వీకెండ్ కూడా రష్ పెద్దగా లేకపోవడంతో భక్తులు పెద్ద ఇబ్బంది పడకుండానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వర్షాలు, తుపాను హెచ్చరికలతో భక్తులు తమ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నడకదారి వచ్చే భక్తులకు నాలుగు గంట సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడుగంటలకు సర్వదర్శనం క్యూలైన్‌లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం పన్నెండు గంటల పాటు శ్రీవారి దర్శన సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,392 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,248 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.83 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు రావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.