Ys Jagan : జగన్ కు నిజంగానే ప్రాణహాని ఉందా? ఆయన అందుకే బెంగళూరును ఎంచుకున్నారా?

వైసీపీ అధినేత జగన్ గత కొద్ది రోజుల నుంచి బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు

Update: 2024-08-05 12:28 GMT

వైసీపీ అధినేత జగన్ గత కొద్ది రోజుల నుంచి బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. గతంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండే జగన్ ఇప్పుడు మాత్రం దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరును ఎంచుకున్నారు. తనకు అదే సురక్షిత ప్రాంతమని ఆయన నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ అయినా, తాడేపల్లి అయినా తనకు సురక్షితం కాదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు అంటున్నారు. అందుకే తాడేపల్లికి అలా వచ్చి ఇలా బెంగళూరుకు వెళ్లి అక్కడ గడుపుతున్నారు. ఫ్యామిలీతో సహా అక్కడే ఎక్కువ కాలం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఆయనకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

దాడులు జరుగుతాయని...
వైఎస్ జగన్ కు తాడేపల్లిలో పెద్ద నివాసం ఉంది. ప్రభుత్వం ఎన్నికల తర్వాత సెక్యూరిటీని తొలగించింది. అంతే కాదు. ఆయన ఇంటికి వెళ్లే దారిని కూడా ఓపెన్ చేసింది. దీంతో ఆయన ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. తనపై దాడులు జరిగే అవకాశముందని ఆయనకు తెలియడం వల్లనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు తెలుగు పోస్టుకు చెప్పారు. తనను అడ్డుతొలగించుకునే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం ఆయనలో బలంగా ఉండటం కారణంగానే జగన్ బెంగళూరును సేఫ్ ప్లేస్ గా ఎంచుకున్నారని, అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళుతుంటారని పార్టీనేతలు చెబుతున్నారు.
లోటస్ పాండ్ కు కూడా...
మరో వైపు హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసం కూడా సురక్షితం కాదని ఆయన గుర్తించారని అంటున్నారు. అక్కడ తన ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశముందని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా లోటస్ పాండ్ లో పక్కనే తన చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ కూడా ఉండటం ఆయనకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. అందుకే లోటస్ పాండ్ వైపు ఆయన ఓటమి చెందిన తర్వాత కన్నెత్తి చూడలేదు. అంతా బెంగళూరు వైపు చూస్తున్నారు. బెంగళూరులో ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని కొంత ప్రశాంతంగా ఉండవచ్చన్న నమ్మకంతో జగన్ ఉన్నారని పార్టీనేతలు అంటున్నారు. అవసరమైతే తప్ప తాడేపల్లికి ఆయన రారు అని కూడా చెబుతున్నారు.
కార్యకర్తల ముసుగులో...
తాడేపల్లిలో ఉంటే పార్టీ కార్యకర్తల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కార్యకర్తల ముసుగులో తనపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన భావించి ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన తాజాగా తనకు ప్రాణహాని ఉందని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు సెక్యూరిటీని పెంచాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు తగినంత సెక్యూరిటీనీ ప్రభుత్వం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మొత్తం మీద జగన్ మాత్రం తనకు ప్రాణహాని ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఏపీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారని పార్టీనేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News