Ys Jagan : తప్పు ఎక్కడ జరిగిందో తెలుసు.. ఎలా జరిగిందో.. తెలుసు.. ఇక సమీక్ష అవసరమా బాసూ

వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు తన పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్నారు

Update: 2024-06-13 06:37 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు తన పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఆయన సమీక్షించనున్నారు. ఇందులో పెద్దగా సమీక్షించాల్సిన పనిలేదు. ఎందుకు జనం ఓడించారన్నది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అందరికీ అర్ధమవుతుంది. పోలింగ్ తర్వాత ఎవరికీ అంచనాలు అందకపోయినా.. అసలు లోపం ఎక్కడ ఉందన్నది ఫలితాల తర్వాత మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇంతోటి దానికి సమీక్షలు అవసరమా? ఆలోచనలు మారాలి. తన నిర్ణయాలు విఫలమయ్యాయని అంగీకరించాలి. అప్పుడే జగన్ మరోసారి విజయం వైపు సాగే అవకాశముంది. అంతే తప్ప ఓటమికి గల కారణాలు ఏవేవో చెబుతూ కుంటి సాకులు చెప్పి నేతలకు బయటకు పంపించిననంత మాత్రం జనం మనస్సులయితే మారవన్నది తెలుసుకోవాలి.

ఓటు బ్యాంకున్నా...
రాష్ట్రంలో ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంటుంది. చంద్రబాబును అభిమానించే ఓటర్లున్నట్లే.. జగన్ అంటే ఇష్టపడే ఓటర్లు కూడా అంతే ఉంటారు. అలాగే ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంటుంది. ఇప్పుడు జగన్ కు వచ్చిన ఓట్లను చూసినా దాదాపు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. అంటే వీరంతా జగన్ పాలన అంటే ఇష్టపడి వేసి ఉండవచ్చు. లేకుంటే సంక్షేమాన్ని అందుకున్న వారిలో ఉండవచ్చు. మరొక రకమైన ఓటర్లు కావచ్చు. వారిని విడదీసి చూడలేని పరిస్థితి కాబట్టి చెప్పలేం. కానీ జగన్ పార్టీ దారుణ ఓటమికి మాత్రం కేవలం మూడు పార్టీలు కలయిక ఒక్కటే కారణం కాదన్నది వాస్తవం. అన్నింకంటే ఐదు కారణాలు జగన్ ఓటమికి కారణాలుగా పార్టీ నేతలే చెబుతున్నారు. తటస్థ ఓటర్లు ఈసారి జగన్ వైపు మొగ్గు చూపలేదు. దానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని అంటున్నారు.

క్లాస్ వార్ : పేదలను మరింతగా దగ్గరకు చేర్చుకునే క్రమంలో జగన్ అత్యుత్సాహం చూపారు. పేదలు - పెత్తందార్ల మధ్య యుద్ధం అంటూ ఆయన అందుకున్న నినాదం బెడిసి కొట్టింది. కమ్యునిస్టులు ఆ నినాదం అందుకునే ఎందుకూ కొరగాకుండా పోయిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ అధినేత గుర్తుకు తెచ్చుకుంటే మంచింది. ఈ నినాదంతోనే అగ్రవర్ణాల్లో అధిక భాగం జగన్ పార్టీకి దూరమయ్యారు. ఇది తమకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని, తాము చెల్లించిన పన్నులు అప్పనంగా అందరికీ జగన్ పంచి పెడుతున్నారన్న బలమైన భావన ఆ వర్గాల్లో పాతుకుపోయింది. అదే పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసేలా చేసిందని చెప్పాలి. రెడ్డి కులంతో పాటు అగ్రకులంలో అధిక భాగం ఈసారి జగన్ పక్షాన నిలవకపోడం వల్లనే ఈ దారుణ ఓటమి సంభవించిందని లెక్కలు చెబుతున్నాయి.

కాపిటల్స్ : ఇదొక విఫల ప్రయోగం అన్నది అందరికీ తెలిసిందే. ఒకే రాజధాని ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. కానీ జగన్ సెంటిమెంట్ తో కొట్టాలని భావించి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చారు. దీంతో పెట్టుబడులు కూడా పెద్దగా రాలేదు. మూడు రాజధానుల అంశం కూడా ప్రజల్లో పెద్దగా వెళ్లకపోగా అది బూమ్ రాంగ్ అయిందని ఎన్నికల ఫలితాల తర్వాత కానీ జగన్ కు తెలిసిరాలేదు. ఒకే రాజధానితో పాలన చేస్తూ మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనను పక్కనపెట్టి అసాధ్యమైన, అలివికాని, న్యాయపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్న త్రీ కాపిటల్స్ ను పట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. మూడు ప్రాంతాల్లోనూ దెబ్బతినాల్సి వచ్చింది. ప్రజలకు కావాల్సింది తమ ఇంటి ముంగిట రాజధాని కాదు.. తమ ఇంట్లో ఉద్యోగమన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది.

క్యాడర్ : జగన్ అధికారంలోకి రాగానే తన వల్లనే ఇన్ని స్థానాలు వచ్చాయన్నారు. తన పాదయాత్రతోనే తనకు ఇంతటి విజయాన్ని ప్రజలు అందించారనుకున్నారు. 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు 175 ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు తప్పించి.. అంతటి విజయానికి కారకులైన క్యాడర్ ను మాత్రం జగన్ విస్మరించారు. పాలనలో సంస్కరణలు అవసరం. వాలంటీర్ల వ్యవస్థను తప్పుపట్టలేం. అదే సమయంలో క్యాడర్ ను కాపాడుకోవడం ప్రతి పార్టీ నేత ముఖ్యకర్తవ్యం. కానీ జగన్ మాత్రం క్యాడర్ ను పూర్తిగా విస్మరించారు. కనీసం వారితో కలిసేందుకు, వారి కష్టనష్ఠాలను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించిన పాపాన పోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో కసితో పనిచేసిన క్యాడర్, లీడర్లు ఈసారి మనమెందుకు కష్టపడాలి? ఉన్న సొమ్ములు ఎందుకు పోగొట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేవలం వాలంటీర్ల పై ఆధారపడి.. పటిష్టంగా, పారట్ీకి వెన్నుముకగా ఉన్న క్యాడర్ ను విస్మరించడంతోనే ఇంతటి దుర్గతి పట్టిందన్నది జగన్ అంగీకరించి తీరాల్సిందే.

వెల్‌ఫేర్ : గెలుపు తీరాలకు చేర్చే ఓటర్లు వేరు. రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి అనే అంశాలతో పాటు కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనికి తగినట్లుగా పాలకులు నడుచుకోవాలి. ఆ విధంగా రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి. కానీ కరోనా రెండేళ్లలో తాము ఇది చేశామని, 132 సార్లు బటన్ నొక్కానని, 2.75 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేశానని, ఆ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే అనుకుని భావించి జగన్ బొక్క బోర్లా పడ్డారు. అందులో కొంత శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఓటర్లు టీడీపీ సూపర్ సిక్స్ కు ఫిదా అయ్యారు. చంద్రబాబును జనం నమ్మరులే అని భ్రమించారు. కానీ జనం మాత్రం తమకు వచ్చే డబ్బులు పెరిగితే చాలనుకుని అటు వైపు మొగ్గారు. ఎన్నికల మ్యానిఫేస్టోలోనూ కనీసం మూడు వేల నుంచి పింఛను 2029 వరకూ పెంచనని నిర్మొహమాటంగా చెప్పి జగన్ తన కిందకు నీళ్లు తానే తెచ్చుకున్నట్లయింది. అవతలవాళ్లు నెలకు నాలుగువేలు ఇస్తారరంటే ఎప్పుడో 3,500 ఇస్తానంటే ఎలా తమ వైపు నిలబెడతారు? అన్నద ఆలోచన కూడా చేయలేదు. అదే కొంపముంచినట్లయింది.

డెవలెప్‌మెంట్ : సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ గత ఐదేళ్లలో కనీసం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. కంపెనీలను తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే రెండున్నర లక్షలంటూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సంఖ్య చెబుతున్నారు తప్పించి, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో యువత ఎదురు తిరిగింది. ఇక ఈ పాలనతో మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయింది. దీంతో పాటు కనీసం బాగులేని రహదారులు కూడా మరమ్మతులు చేయాలన్న ధ్యాసలేదు. దీంతో పాటు మద్యం ధరలను పెంచడం కూడా కొంత శాతం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. మద్యాన్ని మాన్పించాలంటే ధరలను పెంచడంతో మొదలు పెట్టకూడదని, పూర్తిగా దానిని నిషేధించాలన్న విష‍యం ఇప్పటికైనా అర్థమయి ఉండాలి. ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే ఇరవై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారంటే.. జగన్ చేసిన పొరపాటు గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. రాయలసీమలో సొంత సామాజికవర్గమే ఎదురుతిరిగిందంటే అంతకు మించి విశ్లేషణ ఏముంటుంది? తప్పు ఎక్కడ జరిగిందన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. కానీ ఎందుకు చేశామన్నదే ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో విశ్లేషంచుకోవాల్సి ఉంది. అదే ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం.


Tags:    

Similar News