Ys Jagan : జగన్ చంద్రబాబు పాలిటిక్స్ ను సీరియస్ గా తీసుకోవడం లేదా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది పార్టీ నేతలకు కూడా అర్థమవుతుంది. జగన్ నిజంగా ఏపీ రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఆయన ఇలా ఏ విషయాన్ని లైట్ గా తీసుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో? కోల్పోయిన తర్వాత కూడా అదే మాదిరిగా వ్యవహారశైలి ఉండటంతో పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ మాజీ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతకాలం తమ వాయిస్ ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తారన్న కామెంట్స్ సోషల్ మీడియాలోనే కనపడుతుంది. ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి నాలుగు నెలలు కూడా కాలేదు.
క్యాష్ చేసుకునే దిశగా...
కానీ హామీలు అమలు చేయకపోవడంతో కొంత ప్రజల్లో అసంతృప్తి, అసహనం నెలకొన్న మాట వాస్తవమే. కానీ దానిని క్యాష్ చేసుకునేందుకు జగన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం కూడా ఇప్పుడు పార్టీ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి జగన్ లో సీరియస్ నెస్ ఉంటే జిల్లా కేంద్రాలకు వచ్చి పార్టీ నేతలతో, క్యాడర్ తో సమావేశాలను ఏర్పాటు చేసి కొంత ధైర్యాన్ని చెప్పేవారు. కానీ జగన్ అలా చేయడం లేదు. ఎప్పటి లాగానే తాడపల్లి ప్యాలెస్ లోనే పరిమితమై అక్కడే వైసీసీ నేతలు, జిల్లా లీడర్లతో సమీక్షలు చేస్తున్నారు. జిల్లాలకు అయితే పార్టీ అధ్యక్షులు నియమిస్తున్నారు. కానీ వారిని క్యాడర్ కు పరిచయం చేయడమే కాకుండా వారికి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో బాధ్యతలను అప్పగించాలి.
మీడియా సమావేశంలో...
అప్పుడే నేతలతో సమావేశమై వారు యాక్టివ్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. తాడేపల్లి నుంచి ఒక ప్రకటన జారీ చేసినందువల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. మరోవైపు ఆయన తాడేపల్లిలో ఉండేది తక్కువ. బెంగళూరులో ఉండేది ఎక్కువగా ఉంది. తిరుమల లడ్డూ వివాదంపై కూడా వైసీపీ నేతలు సమగ్ర వాదనను వినిపించలేకపోయారు. జగన్ మీడియా సమావేశం పెట్టినా తాను టంగ్ స్లిప్ అయి చంద్రబాబుకు అనుకోని ఆయుధం ఇచ్చారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చెబుతానని జగన్ చెప్పడంతో అలాగయితే హిందూ మత విశ్వాసాలను తిరుమలలో గౌరవించాల్సిందేనని చంద్రబాబు నొక్కి చెప్పడం కూడా జగన్ బేలతనానికి కారణమయింది.
వర్క్ అవుట్ చేయకుండా...
కనీసం మీడియా సమావేశం పెట్టేటప్పుడు స్క్రిప్ట్ చదువుకుని మాట్లాడి ఉంటే సరిపోయేదని వైసీపీ నేతలే అంటున్నారు. చంద్రబాబు నుంచి టీడీపీ నేతల డిక్లరేషన్ వాదనలకు జగన్ బలపర్చినట్లయిందని, ఇలా అయితే ఎలా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎక్సర్ సైజ్ లేకుండా మీడియా సమావేశాలు పెట్టి జగన్ అభాసుపాలు అవుతున్నారన్న కామెంట్స్ జోరుగా వినిపస్తున్నాయి. దీనిపై సక్రమంగా వర్క్ అవుట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలను జగన్ కొని తెచ్చుకుంటున్నారని వైసీపీ లీడర్లే అంటున్నారంటే ఒకసారి అంతర్మధనం చేసుకుంటే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. మరి జగన్ తన పద్ధతిని ఇప్పటికైనా మార్చుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.