Ys Jagan : ఎందుకు జగన్ మళ్లీ ఈ సలహాదారులు...? ఉన్న వాళ్లు చాలదనా?

వైసీపీ ఛీఫ్ వైఎస్ జగన్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నట్లుంది. ఓటమి నుంచి తేరుకోనట్లే కనపడుతున్నారు.

Update: 2024-09-20 08:22 GMT

ysjagan

వైసీపీ ఛీఫ్ వైఎస్ జగన్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నట్లుంది. ఓటమి నుంచి తేరుకోనట్లే కనపడుతున్నారు. నేతలపై ఆయనకు నమ్మకం కలగడం లేదని పిస్తోంది. క్యాడర్ పై కూడా ఒకింత విశ్వాసం సన్నగిల్లినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే హడావిగా ఇప్పుడు సలహాదారును నియమించుకున్నారు. నిజానికి వైసీపీకి క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్ బేస్ ఉంది. ఆ విషయం జగన్ కు తెలుసు. 2014లో పార్టీ ఏర్పడిన నాటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో పాటు, కరడు కట్టిన కాంగ్రెస్ నేతలు కూడా వైసీపీలో చేరారు. రెడ్డి సామాజికవర్గంతో పాటు అనేక సామాజికవర్గం నేతలు జగన్ కు అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయినా జగన్ వెంటనే నిలిచారు. నడిచారు.

2019 ఎన్నికల్లో....
2019 ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. జగన్ చెమటోడ్చారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. జనం గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ చేసిన నినాదం బాగా ఆ ఎన్నికల్లో జనాలకు ఎక్కడంతో 151 స్థానాలను సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగలిగారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన ఎవరు సలహాదారులను నియమించుకోలేదు. ఎన్నికల వ్యూహకర్తలను నమ్ముకోలేదు. కేవలం ఐ ప్యాక్ టీం సర్వేలపైనే ఆయన ఆధారపడి టిక్కెట్లను కేటాయించారు. కానీ 2024 జగన్ ఆట అట్టర్ ప్లాప్ షో అయింది. కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితం కాగలిగింది. చివరకు సొంత జిల్లా కడపలోనూ మూడు స్థానాలు గెలవడమంటే పార్టీ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా మిగిలింది.
ఎవరీ మోహన్ సాయిదత్?
అయితే ఇటీవల జగన్ కొత్త సలహాదారుడిని నియమించుకున్నారు. ఆళ్ల మోహన్ సాయిదత్ ను జగన్ సలహాదారుడిగా నియమించారు. అయితే ఎవరీ ఆళ్లసాయి దత్ అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు. ఆళ్ల సాయిదత్ టీం తెలంగాణలో బీజేపీకి పనిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. చెన్నైలో ఐఐటీ అభ్యసించిన సాయిదత్ గతంలో నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గంలో వ్యూహకర్తగా పనిచేశారు. లోకేష్ పర్యటనల దగ్గర నుంచి ప్రచారం వరకూ ఆయనే ప్లాన్ చేశారంటారు. అనేక టీవీల్లో విశ్లేషకుడిగా కూడా కనిపించిన సాయిదత్ ను ఇప్పుడు ఏరికోరి వైఎస్ జగన్ పార్టీ నిర్మాణ వ్యూహకర్తగా నియమించుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
బలోపేతం అవుతుందా?
అయితే వ్యూహకర్తలను, సలహాదారులును నియమించుకున్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందా? అన్నదే ప్రశ్న. పార్టీ నిర్మాణం జగన్ కు తెలియంది కాదు. కావాల్సినంత మంది సీనియర్ నేతలు పార్టీలో ఉన్నారు. వారితో ఎప్పటికప్పుడు సమావేశమై వారి సలహాలు తీసుకుంటే సరిపోతుంది కదా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంతోటి దానికి సలహాదారులు అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఎన్నికల సమయంలో పార్టీ నేతల మీద వత్తిడి పెరగడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పార్టీ నిర్మాణానికి మళ్లీ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి. ఎక్కడికక్కడ నాయకత్వాన్ని నియమించాలి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారినే నియమించాలన్న షరతులు ఏమీ లేవు. మంచిపేరు, సేవా థృక్పథం, ప్రజాసమస్యలకు వెంటనే స్పందించే ఏ నేత అయినా నాయకుడిగా ఎదుగుతారు. పార్టీని బలోపేతం చేస్తారు. అది మానేసి పార్టీ నేతలపై ఒత్తిడి తేవడానికి ఎందుకీ అనవసర ప్రయత్నాలంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. అంతే..జగన్ లో మార్పు రాదనడానికి ఈ నియామకం ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు పార్టీ నేతలు.


Tags:    

Similar News