Sajjala : జగన్ పై దాడి ప్రీ ప్లాన్డ్
వైఎస్ జగన్ పై దాడి పిరికిపింద చర్య అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
వైఎస్ జగన్ పై దాడి పిరికిపింద చర్య అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తృటిలో ప్రాణాపాయంతప్పిందన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘటన అందరూ చూసి ఉంటారని, చూసిన వారికి ఎవరికైనా జగన్ పై కావాలనే ఈ దాడి చేశారని అనిపిస్తుందని అన్నారు. సున్నితమైన భాగాన్ని చూసి కొట్టారంటే అది హత్యా ప్రయత్నం కాక మరేమిటి అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ, జనసేన నేతలు ఘటనను ఖండించారు కానీ, భద్రతావైఫల్యం అంటూ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. నాడు విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదా? అప్పడు కూడా భద్రతావైఫల్యమేనా? అని సజ్జల ప్రశ్నించారు.
జనం బాగా వస్తున్నారని...
రాయలసీమలో జనం బాగా వచ్చినా కోస్తాంధ్ర వచ్చే సరికి జగన్ బస్సు యాత్రకు స్పందన ఉండదని టీడీపీ వేసుకున్న అంచనాలు వమ్మయ్యాయని పోలీస్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ బస్సు యాత్రకు ఆదరణ వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందన్నారు. జగన్ జనంలోకి రాకూడదన్న ఉన్మాదంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. జగన్ కు మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ కు బలమైన గాయమయిందని, కణతి భాగంలో రాయి తగిలి ఉంటే ప్రాణలకు ప్రమాదం ఏర్పడి ఉండేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, పక్కా ప్లాన్ తోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. అసలు నటిస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు.