రాజధానిలో ఇంకో రగడ
రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని పేదలకు ఇచ్చేందుకు 268 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపడం చర్చనీయాంశమైంది. రాజధాని గ్రామాలైన బోరుపాలెం, నెక్కళ్లు, దొండపాడుతో పాటు మరికొన్ని గ్రామాల్లో సెంటు స్థలాలను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఎలా భూములను పంచుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని భూములను పంచుకుంటూ పోతే కీలక నిర్మాణాలకు భూమి ఎలా మిగులుతుందని రాజధాని రైతులు నిలదీస్తున్నారు.
జిల్లా కలెక్టర్ల అంగీకారం...
అమరావతిలో ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు స్థలాలు కేటాయించాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు సీఆర్డీఏ కమిషనర్ కు లేఖలు రాశారు. కలెక్టర్లు అడిగిన 1134.58 ఎకరాల భూమి కంటే అదనంగా మరికొంత భూమి కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఎస్3 జోన్ లో అదనంగా 268 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ ఓ లేఖ ద్వారా బదులిచ్చారు. గుంటూరు జిల్లాలో 23,235 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 26,739 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఫొటోలు సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. మరోవైపు అమరావతి జేఏసీ నేత కొలకపూడి శ్రీనివాసరావు నేటి నుంచి అమరావతి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు.